మెదక్ రాజకీయాల్లో వేడి పెంచిన మైనంపల్లి హనుమంత రావు వ్యాఖ్యలు.

తేది:17-12-2025మెదక్ జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.

కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోవర్టులకు హెచ్చరిక.

మెదక్ జిల్లా: కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కోవర్టులపై కఠిన చర్యలు తప్పవని కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా పనిచేస్తూ వెన్నుపోటు పొడిచే వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ రహస్యంగా బీఆర్‌ఎస్‌కు సహకరిస్తున్న వర్గాలు ప్రతి నియోజకవర్గంలో ఉన్నాయని కాంగ్రెస్ నేత హనుమంత్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ రహస్య వ్యవస్థ పూర్తిగా అంతమైతే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశాన్ని తాను ఎన్నిసార్లు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, ఆ రహస్యంగా పనిచేస్తున్న వర్గాలు మాత్రం పార్టీని వదలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికలు, పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించిన వెంటనే అవి ప్రత్యర్థి శిబిరాలకు చేరిపోతున్నాయన్నది తీవ్ర ఆందోళన కలిగించే అంశమని హనుమంత్‌రావు పేర్కొన్నారు. అంతర్గత సమాచారం లీక్ కావడం వల్ల పార్టీకి నష్టం వాటిల్లుతోందని విమర్శించారు.
పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యకర్తలు సమిష్టిగా పని చేయాలని పిలుపునిచ్చిన మైనంపల్లి, కాంగ్రెస్‌ను బలహీనపరిచే కుట్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తెలిపారు. ఇతర పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న వారిపై ఇప్పటికే నిఘా పెట్టినట్లు వెల్లడించారు.
జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని, నిజాయితీగా పనిచేసే నాయకులు, కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. రానున్న రాజకీయ పరిణామాల్లో పార్టీ ఐక్యతే విజయానికి మూలమని పేర్కొన్నారు.
కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తామని, పార్టీ గౌరవాన్ని కాపాడేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని మైనంపల్లి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *