ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్‌కతా పర్యటనలో భాగంగా సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ‘GOAT టూర్’ ఈవెంట్‌లో తలెత్తిన తీవ్ర గందరగోళం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టించింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విచారణకు ఆదేశించడంతో, క్రీడా శాఖ మంత్రి అరూప్ బిస్వాస్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. విచారణ నిష్పాక్షికంగా జరిగేందుకు వీలుగా తాను తప్పుకుంటున్నట్లు బిస్వాస్ ముఖ్యమంత్రికి చేతిరాత లేఖలో పేర్కొన్నారు.
శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో మెస్సీ కేవలం 20 నిమిషాల్లోనే వెళ్లిపోవడంతో ఆగ్రహించిన ప్రేక్షకులు స్టేడియాన్ని ధ్వంసం చేసి రచ్చ చేశారు. టికెట్ల కోసం రూ. 15,000 వరకు ఖర్చు చేసిన అభిమానులు.. మంత్రి బిస్వాస్ వంటి ప్రభావవంతమైన వ్యక్తులు మెస్సీని చుట్టుముట్టడం వల్ల ఆయన్ను సరిగా చూడలేకపోయామని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరాశ చెందిన అభిమానులు మైదానంలోకి వాటర్ బాటిళ్లు విసిరి, స్టేడియం సీట్లను ధ్వంసం చేశారు.
విచారణ ప్యానెల్ సమర్పించిన ప్రాథమిక నివేదిక ఆధారంగా, ప్రభుత్వం ఈ ఘటనకు బాధ్యులైన సీనియర్ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంది. రాష్ట్ర డీజీపీ రాజీవ్ కుమార్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసి, నిర్వహణ లోపాలు, భద్రతా వైఫల్యాలపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. బిధానగర్ పోలీసు చీఫ్‌తో పాటు క్రీడా శాఖ ముఖ్య కార్యదర్శికి కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఈ ఘటనతో రాబోయే ఎన్నికల ముందు టీఎంసీ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది.