GHMC డిలిమిటేషన్‌పై ఆమీన్పూర్ ప్రజల అభ్యంతరాలు – పునర్విమర్శ చేయాలని కమిషనర్‌కు వినతి.

తేదీ:16-12-2025 TSLAWNEWS అమీన్‌పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు.

GHMC పరిధిలోని ఆమీన్పూర్ ప్రాంతంలో ప్రతిపాదించిన వార్డు డిలిమిటేషన్ విభజనలపై ఆమీన్పూర్ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు GHMC షెరిలింగంపల్లి జోన్ కమిషనర్‌కు ఆమీన్పూర్ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు వినతి పత్రం సమర్పించారు.
ఆమీన్పూర్ ప్రాంతంలో దాదాపు లక్ష మంది జనాభా ఉన్న నేపథ్యంలో, సమర్థవంతమైన పరిపాలన, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే కనీసం 3 నుంచి 4 డివిజన్లు అవసరమని వారు స్పష్టం చేశారు. అయితే ప్రస్తుత డిలిమిటేషన్ ప్రతిపాదనలో కేవలం రెండు డివిజన్లు మాత్రమే (270 – ఆమీన్పూర్, 271 – సుల్తాన్పూర్) చూపించడం ప్రజల ఆశయాలకు, పరిపాలనా అవసరాలకు అనుగుణంగా లేదని పేర్కొన్నారు.
రోజురోజుకూ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో జనాభా గణనీయంగా పెరుగుతోందని, ఈ పరిస్థితుల్లో డివిజన్ల సంఖ్య పెంచకుండా కొనసాగితే ప్రజలకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని నాయకులు తెలిపారు. మొత్తం లక్ష జనాభాను పరిగణనలోకి తీసుకుని, ఒక్కో డివిజన్‌కు సుమారు 25 వేల మందికి మించకుండా విభజనలు చేయాలని కోరారు.
అదేవిధంగా, ప్రతిపాదిత డివిజన్లలో ఒకదాన్ని తప్పనిసరిగా “బీరంగూడ డివిజన్”గా నామకరణం చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
కావున, ఆమీన్పూర్ ప్రజల అభిప్రాయాలను గౌరవించి, ప్రస్తుత డిలిమిటేషన్‌ను పునర్విమర్శించి తగిన సవరణలు చేయాలని వారు GHMC అధికారులను కోరారు.

ఈ వినతిపత్రంపై ఆమీన్పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షులు జీ. శశిధర్ రెడ్డి, ఎండోమెంట్ శివాలయ చైర్మన్ భైసా సుధాకర్ యాదవ్, అమీన్పూర్ మాజీ కౌన్సిలర్ మున్న, INC నాయకులు మహేష్, కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ నవీన్ ముదిరాజ్‌తో పాటు మన్నే రవీందర్, దుద్ధ్యల సతియన్న, చంద్రశేఖర్, మహేష్ గౌడ్, నరేష్ యాదవ్, మల్లేష్ యాదవ్, దీపక్ గౌడ్, రాజు, శ్రీనివాస్, ప్రకాష్, రాఘవ్, వల్లభ తదితర ముఖ్య నాయకులు, కార్యదర్శులు, సభ్యులు సంతకాలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *