ఎంసెట్ దరఖాస్తులగడువు ఏప్రిల్ 20 వరకు పొడిగింపు


కరోనా విజృంభణ నేపథ్యంలో తెలంగాణలో జరగాల్సిన అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, పలు కారణాల వల్ల ఎంసెట్ పరీక్షకు ఇప్పటికీ దరఖాస్తులు చేసుకోలేకపోయిన విద్యార్థులకు అధికారులు శుభవార్త చెప్పారు. కరోనా విజృంభణ నేపథ్యంలో ఎంసెట్ దరఖాస్తుల గడువును పొడిగించినట్లు పేర్కొన్నారు. మార్చి 31తో ముగిసిన ఎంసెట్ దరఖాస్తుల గడువును ఏప్రిల్ 20వరకు పొడిగిస్తున్నట్లు ఈ రోజు అధికారులు ప్రకటించారు. అప్పటికీ దరఖాస్తు చేసుకోలేకపోతే రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 22వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.1000 ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు దొర్లితే ఏప్రిల్‌ 21 నుంచి 23 మధ్య దిద్దుకునే అవకాశం ఉంది. హాల్‌టికెట్లను మే1 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్‌ వారికి మే 4, 5, 7వ తేదీల్లో, అగ్చికల్చర్, మెడికల్‌ గ్రూపుల అభ్యర్థులకు మే 9, 11న పరీక్ష ఉంటుంది. మరోపక్క, ఏపీ ఎంసెట్‌ దరఖాస్తుల గడువును కూడా పొడిగించారు. విద్యార్థులు ఏప్రిల్‌ 17వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని జేఎన్‌టీయూకే ప్రకటించింది. ఆలస్య రుసుముతో ఎప్పటివరకు దరఖాస్తులు చేసుకోవచ్చన్న అంశాన్ని మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు. ఏపీ ఎంసెట్‌ పరీక్ష తేదీలు కూడా వాయిదాపడ్డాయి. ఇంతకు ముందు ప్రకటించిన పరీక్ష తేదీలను వెబ్‌సైట్‌ నుంచి తొలగించారు. అయితే, కొత్త తేదీలను ప్రకటించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *