తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వచ్చే 2029 ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. సోమవారం ‘ఆస్క్ కవిత’ పేరుతో ఎక్స్ (X) వేదికగా నెటిజన్లతో చాట్ చేస్తూ, ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె ఈ వ్యాఖ్య చేశారు. రానున్న ఎన్నికల్లో తాను ఖచ్చితంగా బరిలోకి దిగుతానని చెప్పడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
అయితే, 2029లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఒకవేళ జమిలి ఎన్నికలు గనుక వస్తే శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతాయి. తాను ఏ నియోజకవర్గం నుంచి, ఏ ఎన్నికల్లో బరిలోకి దిగుతానన్న విషయంపై కవిత ఈ సందర్భంగా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
గతంలో కవిత నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో గెలిచి, మరొకసారి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆమె బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురికావడంతో, ఆమె ఏ పార్టీ తరఫున, ఏ స్థానం నుంచి పోటీ చేస్తారన్న దానిపై బీఆర్ఎస్ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది.