బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్‌లో ఉన్న సీ ఎస్టేట్ లాడ్జిలో అర్ధరాత్రి పార్టీ చేసుకుంటున్న యువతి, యువకులు భారీ శబ్దాలతో స్థానికులకు ఇబ్బంది కలిగించారు. దీంతో స్థానికులు హెల్ప్‌లైన్ నంబర్ 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. అర్ధరాత్రి 1 గంట నుంచి ఉదయం 5 గంటల వరకు పార్టీ చేసుకున్న ఈ బృందానికి పోలీసులు సడెన్‌గా ఎంట్రీ ఇవ్వడంతో, వారు కంగారుపడ్డారు.
పోలీసులు దాడి చేయడంతో వారి నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నంలో ఒక 21 ఏళ్ల యువతి డ్రైనేజ్ పైపు సాయంతో నాలుగో ఫ్లోర్ బాల్కనీ నుంచి కిందకు దిగేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె పట్టుతప్పి కిందపడింది. తీవ్రంగా గాయపడిన ఆ యువతిని ఆమె స్నేహితులు చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
గాయపడిన యువతి తండ్రి అంటోనీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పార్టీ జరుగుతున్న సమయంలో పోలీసులు డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి, అయితే వీటిని అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది. బాల్కనీలో సరైన రక్షణ ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు లాడ్జి యజమానిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయం జరిగేలా సమగ్ర విచారణ జరపాలని యువతి తండ్రి ఫిర్యాదులో కోరారు.