బెంగళూరు ఆటో డ్రైవర్ గొప్ప మనసు: ‘నేను తండ్రిని, సోదరుడిని’ అంటూ భద్రతపై మహిళా ప్రయాణికురాలికి భరోసా

కర్ణాటక రాజధాని బెంగళూరులో అర్ధరాత్రి 12 గంటల సమయంలో ర్యాపిడో ఆటోలో ప్రయాణించిన ఒక మహిళకు, ఆ డ్రైవర్ యొక్క చర్య ఇప్పుడు నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. ఆటోలో ప్రయాణిస్తుండగా, డ్రైవర్ చేతితో రాసిన ఒక నోట్‌ను చూసిన ఆ మహిళ, దాన్ని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో అది వైరల్ అయింది.

ఆ ఆటో డ్రైవర్ తన చేతి రాతతో రాసిన ఆ నోట్‌లో, “నేను కూడా ఒక తండ్రిని, సోదరుడిని. ప్రయాణికుల భద్రతే నాకు ముఖ్యం. దయచేసి సౌకర్యంగా కూర్చోండి” అని పేర్కొన్నారు. అర్ధరాత్రి సమయంలో ఆటోలో ప్రయాణిస్తున్నప్పటికీ, డ్రైవర్ రాసిన ఆ ఒక్క మాటతో తాను నిజంగా సురక్షితంగా ఉన్నాననే భరోసా కలిగిందని ఆ మహిళ వీడియోలో చెప్పుకొచ్చింది. ఆ నోట్, ఆ డ్రైవర్ యొక్క గొప్ప మనసు ఇప్పుడు సోషల్ మీడియాలో దాదాపు 4 లక్షలకు పైగా వీక్షణలు పొంది, నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆటో డ్రైవర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బెంగళూరు నగర ఆటో డ్రైవర్లపై పెద్ద బాధ్యత ఉందని, వీళ్లే అసలైన నమ్మ బెంగళూరు డ్రైవర్లు అని పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. భద్రత విషయంలో ఆటో డ్రైవర్లు చూపుతున్న ఈ చొరవ గతంలో అర్ధరాత్రి బైక్ చైన్ తెగిపోయినప్పుడు మహిళకు సహాయం చేసిన మరో ర్యాపిడో డ్రైవర్ ఘటనను గుర్తు చేస్తోందని పలువురు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *