ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఇటీవల ప్రపంచ కప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టు సభ్యుల కష్టాలను తెలుసుకుని, వారికి అండగా నిలబడ్డారు. జమ్ము కశ్మీర్‌కు చెందిన అనేఖా దేవి, అసోంకు చెందిన సిము దాస్, అలాగే తెలుగు అమ్మాయిలు దీపిక, కరుణ కుమారి వంటి క్రీడాకారిణులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా మ్యాచ్ ఫీజుల కోసమే క్రికెట్ ఆడుతున్నామని చెప్పడంతో ఆయన చలించిపోయారు. దీంతో మొత్తం 16 మంది జట్టు సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున 80 లక్షలు, సపోర్టింగ్ స్టాఫ్‌కు రూ. 2 లక్షల చొప్పున 4 లక్షలు కలిపి మొత్తం రూ. 84 లక్షల వ్యక్తిగత ఆర్థిక సాయాన్ని పవన్ కళ్యాణ్ అందించారు.
ఆర్థిక సాయంతో పాటు, జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన దీపిక (శ్రీ సత్యసాయి జిల్లా) తన సొంతూరు, తంబలహట్టి తండాకు సరైన రహదారి సౌకర్యం లేక పడుతున్న ఇబ్బందులను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్, మధ్యాహ్నం కోరిన ఆ రోడ్డు నిర్మాణానికి సాయంత్రానికే రూ. 3 కోట్ల నిధులతో పాలనాపరమైన అనుమతులు మంజూరు చేయించారు. అదేవిధంగా, అల్లూరి జిల్లాకు చెందిన కరుణ కుమారికి కూడా వెంటనే సొంత ఇల్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సమస్యను విన్న గంటల వ్యవధిలోనే రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవడం పట్ల ఆయనకు ప్రశంసలు దక్కుతున్నాయి.
ఈ సందర్భంగా అర్జున అవార్డు గ్రహీత, సీనియర్ బ్లైండ్ క్రికెట్ జట్టు సభ్యుడు అజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, సరైన సౌకర్యాలు కల్పిస్తే అంధుల క్రికెట్ జట్టు అద్భుతాలు సృష్టిస్తుందని, ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ తమకు అండగా నిలబడాలని కోరారు. పవన్ కళ్యాణ్ కేవలం డబ్బులే కాకుండా, క్రీడాకారుల వ్యక్తిగత సమస్యలను కూడా పరిష్కరించి, ఇతర రాష్ట్రాల నేతలకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.