సీపీఐ జాతీయ కార్యదర్శి సీపీఐ నారాయణ (CPI Narayana) థియేటర్ల యాజమాన్యాలు టికెట్ ధరలు, స్నాక్స్ ధరలను ఇష్టానుసారం పెంచి సామాన్యులను దోచుకుంటున్నాయని తీవ్ర స్థాయిలో విమర్శించారు. వినోదం సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వాలు తక్షణమే జోక్యం చేసుకుని, థియేటర్ల యాజమాన్యాల నియంతృత్వ పోకడలను అరికట్టాలని డిమాండ్ చేశారు.
నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ-2’ చిత్రం విడుదలైన రోజే పైరసీకి గురికావడంపై నారాయణ స్పందించారు. పైరసీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐబొమ్మ రవి పోలీసు కస్టడీలో ఉండగానే సినిమా బయటకు ఎలా వచ్చిందనేది ఆలోచించాల్సిన విషయమని, దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన సూటిగా ప్రశ్నించారు. కేవలం వ్యక్తులను శిక్షించినంత మాత్రాన పైరసీ సమస్య పరిష్కారం కాదని, వ్యవస్థలోని లోపాలను సరిదిద్దకుండా వ్యక్తులపై నిందలు వేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
పైరసీ పెరగడానికి థియేటర్ల యాజమాన్యాల అధిక ధరలే ప్రధాన కారణమని నారాయణ విశ్లేషించారు. టికెట్ ధరలు పెంచుకుని లాభాలు గడించాలనుకోవడం వల్లే ప్రేక్షకులపై భరించలేని ఆర్థిక భారం పడుతోందని, దీని కారణంగానే వారు అనివార్యంగా పైరసీ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారని తెలిపారు. ధరలు అందుబాటులో ఉంటే జనం థియేటర్లకు వస్తారని, లేకపోతే థియేటర్లు ఖాళీగా దర్శనమిస్తాయని ఆయన పేర్కొన్నారు.