అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు-మారేడుమల్లి ఘాట్ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాద ఘటనా స్థలాన్ని హోం మంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. అధికారులతో మాట్లాడి, వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఘాట్ రోడ్డులో రాత్రి వేళ ప్రయాణాలు నిలిపి వేస్తామని ఆమె తెలిపారు. ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయారని అన్నారు.
ప్రమాదంపై ఆరా తీసిన హోం మంత్రి అనిత, బస్సు డ్రైవర్ అతి వేగం ప్రమాదానికి కారణమని అన్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. మృతి చెందిన వారికి ప్రభుత్వం తరపున ఎక్స్ గ్రేషియా అందిస్తామని తెలిపారు. అంతేకాకుండా, రాత్రివేళ ఘాట్ రోడ్డులో ప్రయాణాలను అనుమతించవద్దని అధికారులను ఆదేశించారు.
భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించడానికి చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేస్తామని మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి శుక్రవారం ప్రమాద స్థలాన్ని పరిశీలించి, చింతూరు ఏరియా ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన నేపథ్యంలో, హోం మంత్రి అనిత ఈ కీలక భద్రతా చర్యల గురించి ప్రకటించారు. రోడ్డు భద్రతా చర్యలను కఠినతరం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.