‘తెలంగాణ రైజింగ్ విజన్ అద్భుతం’: సీఎం రేవంత్ రెడ్డికి డాక్టర్ నోరి దత్తాత్రేయుడి అభినందన లేఖ!

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025ను విజయవంతంగా నిర్వహించడంపై ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందించారు. ఈ సమ్మిట్ చారిత్రాత్మక విజయమని పేర్కొంటూ ఆయన ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు. ఈ సమ్మిట్‌లో అనేక దేశీయ, విదేశీ కంపెనీలు పాల్గొనడం ద్వారా తెలంగాణకు గొప్ప గుర్తింపు లభించిందని ఆయన కొనియాడారు.

డీప్‌టెక్, గ్రీన్‌ఎనర్జీ, లైఫ్ సైన్సెస్ వంటి కీలక రంగాల్లో భారీగా పెట్టుబడులు రావడం శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు. రూ.లక్షల కోట్ల పెట్టుబడులు రావడం సీఎం రేవంత్ పాలన, రాష్ట్రంలో నెలకొన్న స్థిరత్వం, భవిష్యత్తుపై పెట్టుబడిదారులకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమని డాక్టర్ నోరి తన లేఖలో కొనియాడారు. ఈ పెట్టుబడులు ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్‌కు అద్దం పడుతున్నాయని, ప్రపంచ వేదికపై తెలంగాణ సత్తా చాటడానికి ఇది దోహదపడుతుందని వివరించారు.

రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ, ప్రజల జీవన ప్రమాణాల పెంపు కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. ఈ పెట్టుబడులు ప్రజారోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతగానో ఉపయోగపడతాయని, క్యాన్సర్ చికిత్సలో తెలంగాణ గ్లోబల్ లీడర్‌గా ఎదిగేందుకు అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ప్రపంచ దిగ్గజ కంపెనీలను హైదరాబాద్‌కు రప్పించడం ద్వారా తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి ఒక స్టార్టప్‌గా, మానవ వనరుల అభివృద్ధికి ప్రపంచ కేంద్రంగా మారుతుందుని సీఎం రేవంత్ రెడ్డి నిరూపించారని డాక్టర్ నోరి దత్తాత్రేయుడు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *