లాక్ డౌన్ కొనసాగిస్తారా…!

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్త లాక్ డౌన్ను ఏప్రిల్‌ 15 తర్వాతా కొనసాగిస్తారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కోవిడ్‌-19 కేసులు పెరుగుతుండటంతో ప్రజలు మరికొంత కాలం లాక్‌డౌన్‌ కోసం వేచిచూడాల్సి ఉంటుందని యూపీకి చెందిన ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలంటే రాష్ట్రంలో కరోనా ఉనికి ఉండకూడదని, ఏ ఒక్క పాజిటివ్‌ కేసు ఉన్నా లాక్‌డౌన్‌ విరమించడం కష్టమవుతుంది అందుకే ఇందుకు కొంత సమయం అవసరమని యూపీ ప్రభుత్వ అదనపు కార్యదర్శి అవినాష్‌ అవస్థి అన్నారు.

అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనిపై దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెబుతోంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విరమణకు సంబంధించి కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ స్పందిస్తూ సరైన సమయంలో దీనిపై నిర్ణయాన్ని కేంద్రం ప్రకటిస్తుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను తాము ప్రతి నిమిషం పర్యవేక్షిస్తున్నామని, అధికారులతో కూడిన సాధికారిక బృందం నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తోందని చెప్పారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు మార్చి 24న ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్‌ 15 వరకూ మూడు వారాల లాక్‌డౌన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరోవైపు గతవారం సీఎంలతో జరిగిన సమావేశంలో దశలవారీగా లాక్‌డౌన్‌ విరమణకు అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధాని సీఎంల సూచలను కోరారు. లాక్‌డౌన్‌ పొడిగింపునకు ప్రభుత్వం మొగ్గుచూపుతుందని పలువురు భావిస్తుండగా, పేదల జీవనోపాధి, ఆర్థిక భారాలను దృష్టిలో ఉంచుకుని లాక్‌డౌన్‌ సడలింపునకు అవకాశం ఉందని మరికొందరు చెబుతున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు అధికంగా నమోదైన ప్రాంతాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తిస్తున్న క్రమంలో ఆయా ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ కొనసాగిస్తూ ఇతర ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను ఎత్తివేయవచ్చని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *