రైల్వే శాఖ (Ashwini Vaishnav) తత్కాల్ టికెట్ల జారీ వ్యవస్థలో కీలక మార్పులు చేపడుతోంది. ఇది నకిలీ టికెట్లను అడ్డుకోవడానికి, ప్రయాణీకులకు సులభతరం చేసే విధంగా రూపొందించబడింది. ఇప్పటికే, ఆధార్ ఆధారిత OTP ధృవీకరణ వ్యవస్థను అమలు చేయడం ప్రారంభించింది. తాజాగా, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంట్‌లో మాట్లాడుతూ, తత్కాల్ టికెట్ల విషయంలో ప్రయాణీకుల సౌకర్యం కోసం మరిన్ని మార్పులు తీసుకురానున్నట్లు వెల్లడించారు.
రైల్వే శాఖ (Railway Department), తత్కాల్ టికెట్ల వ్యవస్థలో పలు మార్పులను తీసుకొచ్చింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 3.02 కోట్ల అనుమానాస్పద యూజర్ ఐడీలను డీయాక్టివేట్ చేసినట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. వీటి కారణంగా, నకిలీ, ఆటోమేటెడ్ టికెట్ల కొనుగోలు వ్యవస్థను అడ్డుకున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ మార్పుల ద్వారా సామాన్య ప్రయాణీకులకు మెరుగైన విధానం అందుబాటులోకి రానుందని చెప్పారు.
రైల్వే శాఖ, తత్కాల్ టికెట్లను సమర్ధవంతంగా అందించేందుకు మరిన్ని మార్పులు తీసుకొస్తోంది. అధార్ ఆధారిత ఓటీపీ వ్యవస్థను 322 రైళ్లలో అమలు చేయడం ప్రారంభించింది. ఈ విధానంతో, ఆయా రైళ్లలో తత్కాల్ టికెట్ల అందుబాటు సమయం దాదాపు 65% వరకు పెరిగింది. అలాగే, రిజర్వేషన్ కౌంటర్ల వద్ద కూడా ఓటీపీ వెరిఫికేషన్ విధానాన్ని 211 రైళ్లకు వర్తింప చేసింది. దీనితో పాపులర్ రైళ్ల టికెట్ల అందుబాటు సమయం 95% వరకు పెరిగింది.