తెలంగాణలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ (గతంలో ట్విట్) వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయం సాధించిన సర్పంచ్, వార్డు మెంబర్లకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా హోరాహోరీగా పోరాడి ప్రజల మనస్సులు గెల్చుకుని విజయం సాధించిన సర్పంచులుగా, వార్డుమెంబర్లకు, బీఆర్ఎస్ మద్దతుదారులకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు.
సాక్షాత్తూ ముఖ్యమంత్రే పంచాయతీ ఎన్నికల కోసం జిల్లాల పర్యటనల పేరిట ప్రచారం చేసినా ప్రజలు బీఆర్ఎస్ కు పట్టం కట్టారన్నారు. అంతే కాకుండా.. పోటీచేసిన చోట కనీసం 44 శాతం సీట్లను కాంగ్రెస్ దాటకపోవడం ప్రభుత్వంపై పెరిగిన ప్రజావ్యతిరేకతకు నిలువెత్తు నిదర్శనం అంటూ ట్విట్ చేశారు. పంచాయతీ ఎన్నికలు అధికార పార్టీకి కొంత అనుకూలంగా ఉంటాయని తొలుత ప్రచారం జరిగినప్పటికీ.. ప్రజలు మాత్రం బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించారన్నారు. రేవంత్ పరిపాలనా వైఫల్యంపై ప్రజలు పూర్తిగా విసిగిపోయారని ఈ ఎన్నికల ఫలితాలతో బైటపడిందన్నారు.
రెండేళ్లు గడిచినా ఆరు గ్యారెంటీల పేరిట చేసిన సీఎం రేవంత్ మోసం, పెన్షన్ల పెంపు పేరిట చేసిన ద్రోహం, మహాలక్ష్మి పేరిట చేసిన దగా, తులం బంగారం పేరిట చేసిన నయవంచనను గ్రామీణ ప్రాంత ప్రజలు మరిచిపోలేదని పంచాయతీ ఎన్నికల ఫలితాలు తేల్చిచెప్పాయని కేటీఆర్ అన్నారు. సగం స్థానాలు కూడా కాంగ్రెస్ గెలవకపోవడం చూస్తే కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ పల్లెల నుంచే ప్రారంభమైనట్టు స్పష్టంగా తెలుస్తొందని కేటీఆర్ అన్నారు. ఇది ఆరంభం మాత్రమే, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పతనం పాతాళానికి పడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.