వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుతో మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్నందుకు వారిని పవన్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన ఒక్కో క్రికెటర్‌కు రూ.5 లక్షలు, కోచ్‌లకు రూ.2 లక్షల చొప్పున చెక్కులను అందించారు. అంతేకాకుండా ప్రతి మహిళా క్రికెటర్‌ను పట్టు చీర, శాలువా, జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీతో కూడిన బహుమతులను అందించి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మహిళా అంధ క్రికెటర్లు సాధించిన విజయం దేశానికే గర్వకారణమన్నారు. అంధ క్రికెటర్ల ప్రాక్టీస్ కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని.. అన్ని విధాలుగా అండగా నిలవాలని.. ప్రతి ఒక్క రాష్ట్ర సీఎంకు స్వయంగా విజ్ఞప్తి చేస్తానని పవన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందన్నారు. ప్రపంచ కప్ గెలిచిన జట్టులో ఏపీ క్రీడాకారీణులు దీపిక (జట్టు కెప్టన్), పాంగి కరుణా కుమారి ఉండటం సంతోషంగా ఉందన్నారు.
ఇక పవన్‌తో భేటీ సందర్బంగా కెప్టెన్ దీపిక.. తమ గ్రామ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు. దీనిపై వెంటనే స్పందించిన పవన్.. వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకి చెందిన క్రికెటర్ కరుణకుమారి చేసిన విజ్ఞప్తులపైనా తక్షణమే చర్యలు ప్రారంభించాలని పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు.