సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సినిమాల టికెట్ల రేట్ల వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి తమ సినిమాలకు టికెట్ల రేట్లు పెంచుకుంటామని ఎవరూ తమ వద్దకు రావొద్దని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో ఏ సినిమాలకు కూడా టికెట్ల రేట్లు పెంపు ఉండదని తెల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలు సినిమా వర్గాలకు, ముఖ్యంగా సంక్రాంతికి రాబోయే సినిమాల టీమ్స్‌కు బిగ్ షాక్‌గా మారాయి.
మంత్రి మాట్లాడుతూ, “అఖండ 2 సినిమా టికెట్ ధరల పెంపు నాకు తెలియకుండా జరిగింది” అని అన్నారు. ఇకపై ఎలాంటి సినిమాలకు టికెట్ ధరలు పెంచేది లేదని స్పష్టం చేశారు. అసలు.. హీరోలకు అన్ని కోట్ల రెమ్యూనరేషన్ ఎందుకు ఇస్తున్నారంటూ డైరెక్టర్ లపై మండిపడ్డారు. సినిమా అనేది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు చూసేది కాబట్టి, ఇష్టమున్నట్లు ధరలు పెంచితే ఎలా అంటూ ఆయన ఫైర్ అయ్యారు. ఇష్టమున్నట్లు కూల్ డ్రింక్స్, తినుబండారాల రేట్లు పెంచుతున్నారని కూడా మండిపడ్డారు.
ఇక మీదట సినీ ఇండస్ట్రీ వ్యక్తులు ఎవరూ టికెట్ ధరలు పెంచమని నన్ను అడగవద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. మధ్య తరగతి ప్రజలు టికెట్ల పెంపుతో చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమది ఇందిరమ్మ ప్రభుత్వమని, ప్రజలకు అన్ని రకాల పథకాలు, వారికి మేలు చేయడమే తమ ముఖ్య ఎజెండా అని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెల్చి చెప్పారు.