ద్వైపాక్షిక సంబంధాల మెరుగు: చైనా నిపుణులకు వీసా నిబంధనలు సడలించిన భారత్

దాదాపు ఆరేళ్లుగా భారత్, చైనా ద్వైపాక్షిక సంబంధాల్లో నెలకున్న ప్రతిష్ఠంభన క్రమంగా తొలగిపోతోంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడే దిశగా కీలక అడుగు పడింది. చైనా నిపుణులకు వాణిజ్య వీసాల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిబంధనలను సడలించింది. ఈ మార్పులు వ్యాపారాలకు ఊతమిచ్చి, వీసా ప్రక్రియలో జాప్యాలను నివారిస్తాయని సంబంధిత అధికారులు తెలిపారు. ఇది ఇరు దేశాల బంధాన్ని మరింత బలోపేతం చేయనుంది.

చైనా నిపుణులకు సాధ్యమైనంత వేగంగా వాణిజ్య వీసా జారీ కోసం కేంద్ర ప్రభుత్వం నిబంధనల్లో మార్పులు చేసినట్లు సమాచారం. నిబంధనల్లో మార్పులు చేయడం వల్ల వీసా ప్రక్రియలో జాప్యాలను నివారించవచ్చని, దాంతో వ్యాపారాలకు వృత్తి నిపుణుల కొరత లేకుండా చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. వీసా ఆమోద సమయాన్ని నాలుగు వారాల్లోపునకు తగ్గించడం సహా కొన్ని నిబంధనలను తొలగించారని అధికారులు పేర్కొన్నారు. గల్వాన్ లోయ ఘర్షణల తర్వాత చైనా పౌరులకు వీసాలపై కేంద్రం కఠిన ఆంక్షలు విధించింది. ప్రస్తుత వాటిని సడలించడంతో వీసా పొందడంలో ఎదురయ్యే ఇబ్బందులు తప్పాయని సదరు అధికారులు పేర్కొన్నారు.

ఈ నిర్ణయానికి ముందు, చైనా వేదికగా జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. అక్కడ చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తోనూ ప్రధాని మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం భారత్, చైనాలు కలిసి పనిచేయాలని ఆ సందర్భంగా ఇరువురు నేతలూ పిలుపునిచ్చారు. అంతేకాదు, సరిహద్దు వివాదాలను పరిష్కరించుకుని అన్ని రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *