కాంగ్రెస్ పార్టీ పగ్గాలను ప్రియాంక గాంధీ వాద్రాకు అప్పగించాలని, వయసు పైబడిన మల్లికార్జున ఖర్గేను తప్పించాలని ఒడిశా మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ మోక్విమ్ అగ్రనేత సోనియా గాంధీకి లేఖ రాశారు. యువతను ఆకట్టుకోవాలంటే యువ నాయకత్వం అవసరమని, పార్టీ ప్రక్షాళన జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీ, ప్రియాంక వర్గాల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోందని బీజేపీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఏఎన్ఐ వార్తా సంస్థతో మోక్విమ్ మాట్లాడుతూ.. ‘‘పార్టీ క్లిష్ట దశలో ఉంది.. కాంగ్రెస్‌కు కొత్త నాయకత్వం అవసరం.. మల్లికార్జున ఖర్గేకు వయసు ప్రధాన ఆటంకం.. అందుకే మనం యువ నాయకులకు ముందుకు తీసుకురావాలి.. సోనియా గాంధీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు దీనిపై కచ్చితంగా చర్చిస్తారనే నమ్మకం ఉంది’’ అని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన గత మూడేళ్లుగా రాహుల్‌ను కలవడానికి తాను చాలా ప్రయత్నించానని, కానీ అపాయింట్‌మెంట్ దొరకలేదని కూడా లేఖలో పేర్కొన్నారు.
‘‘శతాబ్దపు వారసత్వం ఇతరుల ఓడించడం ద్వారా కాదు.. మనం తీసుకున్న నిర్ణయాల ద్వారా చేజారిపోయింది.. మనం ఇప్పుడు మేల్కొనకపోతే వారసత్వంగా పొందిన కాంగ్రెస్‌ను కోల్పోయే ప్రమాదం ఉంది’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాల్సిన సమయం వచ్చిందని మోక్విమ్ తన ఆరు పేజీల సుదీర్ఘ లేఖలో డిమాండ్ చేశారు.