సంగారెడ్డి జిల్లా భీరంగూడలో జరిగిన యువకుడు కాకాణి శ్రవణ్ సాయి (19) హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. ప్రేమిస్తున్నాడని ఇంటికి పిలిచి హత్య చేశారనే ప్రచారాన్ని యువతి తల్లి ఖండించింది. తన కుమార్తెను కొడుతుంటే శ్రవణ్ సాయి అడ్డు పడటంతో, ఆ దెబ్బ తగిలి అతను చనిపోయాడని యువతి తల్లి పోలీసులకు చెప్పినట్లుగా వార్త తెలిపింది.
శ్రవణ్ సాయి హత్య గురించి బంధువులు ఆరోపణలు చేస్తుండగా, యువతి తల్లి మాత్రం సంచలన విషయాలు వెల్లడించారు. తన కుమార్తె నాలుగు నెలల గర్భవతి అని, ఈ విషయం తెలిసిన తర్వాత కుమార్తెను నిలదీస్తే ఆమె సాయి పేరు చెప్పిందని తెలిపారు. అనంతరం, ఇంట్లో మాట్లాడుతున్న సమయంలో కోపంతో తాను కుమార్తెపై చేయి చేసుకున్నానని, దగ్గర్లో ఉన్న బ్యాట్‌తో కొట్టబోయినప్పుడు సాయి అడ్డుగా వచ్చి ఆ దెబ్బ తగిలిందని వివరించారు. ఈ దెబ్బకు సాయితో పాటు తన కుమార్తె కూడా కిందపడిందని, కుమార్తెకు చేయి విరిగిందని తెలిపారు.
శ్రవణ్ సాయి తల్లిదండ్రులు లేకపోవడంతో, ఆయన పెద్దనాన్న సంరక్షణలో ఉంటున్నారు. వారు మాత్రం ఈ వాదనను ఖండిస్తున్నారు. ఆస్తి కోసమే ఒత్తిడి తెచ్చి తమ బిడ్డను హత్య చేశారని, స్థానిక క్లినిక్‌లో చూపించి పంపేద్దామని చూశారని ఆరోపిస్తున్నారు. సాయిని ఆసుపత్రికి తీసుకొచ్చేసరికే చనిపోయినట్లు వైద్యులు చెప్పినప్పటికీ, తప్పుడు స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యువతి తల్లి ప్రకటనతో ఈ కేసు దర్యాప్తు కొత్త మలుపు తీసుకుంది.