అనంతపురంలో కలకలం: వార్డెన్‌ ఫిర్యాదుతో నలుగురు విద్యార్థినుల ఆత్మహత్యా ప్రయత్నం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలోని కేఎస్ఆర్ జూనియర్ కాలేజీలో ఒకేసారి నలుగురు బాలికలు పురుగుమందు (వాస్మోల్) తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడటం జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ నలుగురు విద్యార్థినుల్లో తాడిపత్రి మండలానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు కూడా ఉన్నారు. విద్యార్థినులు తీసుకున్న ఈ కఠిన నిర్ణయానికి సంబంధించిన పూర్తి కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

అయితే, ఈ ఆత్మహత్యా ప్రయత్నానికి ప్రధానంగా దారితీసిన అంశం… వార్డెన్ వసంత ఆ విద్యార్థినుల గురించి వారి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడమేనని తెలుస్తోంది. తమపై తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసి, బాలికలు తీవ్ర భయాందోళనకు గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆత్మహత్యాయత్నం విషయం గమనించిన వెంటనే వార్డెన్, ఆ నలుగురు బాలికలను చికిత్స నిమిత్తం అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో బాలికలకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, నలుగురు బాలికల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. కుటుంబ సభ్యులు బాలికల ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతున్నప్పటికీ, ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను మాత్రం వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *