లోక్‌సభలో ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ కంగనా రనౌత్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. “మోదీ ఈవీఎంలను కాదు… ప్రజల హృదయాలనే హ్యాక్ చేస్తున్నారు,” అని పేర్కొంటూ, ప్రతిపక్షాలు చేస్తున్న ‘ఓట్ల దొంగతనం’ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఆమె ఖండించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ దేశ భద్రతకు, మహిళల గౌరవ పరిరక్షణకు అత్యవసరమని కంగనా స్పష్టం చేశారు.
అంతేకాకుండా, సభలో తనపై జరిగిన బెదిరింపులు, అవమానాల గురించి ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సభ కార్యకలాపాలు ముందుకు సాగనీయకుండా ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నాయని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీకి పౌరసత్వం లేకుండానే 1983 నుండి ఓటు హక్కు వినియోగించుకున్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, రాహుల్ గాంధీ ఒక విదేశీ మహిళ ఫోటోపై చేస్తున్న ఆరోపణలు పాతవే అయినప్పటికీ, ఆ మహిళ భారత్‌కు రాలేదని స్వయంగా వెల్లడించిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు.
‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని కంగనా రనౌత్ డిమాండ్ చేశారు. పేపర్ బ్యాలెట్ కోసం కాంగ్రెస్ చేస్తున్న డిమాండ్‌ను ఆమె చరిత్రతో పోల్చారు. ఇందిరా గాంధీ–రాజ్‌నారాయణ్ కేసును ఉదాహరణగా చూపించి పేపర్ బ్యాలెట్ వ్యవస్థ ఎందుకు అనుమానాస్పదమైందో వివరించారు. బీహార్‌లో 60 లక్షలకు పైగా అనుమానాస్పద ఓట్ల తొలగింపుతో పోలింగ్ శాతం పెరిగిందని పేర్కొంటూ, దేశవ్యాప్తంగా ఇలాంటి శుద్ధీకరణ అవసరమని ఆమె నొక్కి చెప్పారు.