టీటీడీ బోర్డు సభ్యుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జగన్ తీరు చూస్తే ఆయనకు హిందువుల పట్ల తీవ్ర ద్వేషం ఉన్నట్లు అర్థమవుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల పరకామణి చోరీ కేసు విషయంలో భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని ఆయన మీడియా సమావేశంలో మండిపడ్డారు.
స్వామివారి హుండీ కానుకల లెక్కింపు కేంద్రమైన పరకామణిలో వందల కోట్ల రూపాయల చోరీ జరిగిందని, దానిని ఒక చిన్న దొంగతనంగా చూపించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని నెహ్రూ ఆరోపించారు. “వేల కోట్లు దోచుకున్న మీకు పరకామణి చోరీ చిన్నదిగా కనిపించడం సహజమే. ఈ కేసులో జగన్, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిల పాత్ర నూటికి నూరు శాతం ఉందనేది వాస్తవం” అని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి, పరిటాల రవి హత్య కేసుల్లో సాక్షులను ఎలా అంతమొందించారో, ఇప్పుడు కూడా అదే పద్ధతిని అమలు చేస్తున్నారని జ్యోతుల నెహ్రూ విమర్శించారు. “నిజాలను నిరూపించేందుకు ప్రయత్నించేవారిని వేధించడం, భయపెట్టడం, అవసరమైతే హత్యలు చేయడం వీరికి అలవాటుగా మారింది” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కేసును కూడా తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.