వైద్య విద్య ప్రైవేటీకరణపై బొత్స తీవ్ర విమర్శలు: ‘ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగడంలేదు’

ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్యను పూర్తిగా ప్రైవేటుపరం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని వైసీపీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఆరోపించారు. ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి, కార్పొరేట్ శక్తులకు మేలు చేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. “ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగడంలేదు” అని వ్యాఖ్యానించిన ఆయన, ముఖ్యమంత్రి చంద్రబాబుది ఎప్పుడూ కార్పొరేట్ పక్షపాతమేనని, ఇది ఆయనకు కొత్తేమీ కాదని అన్నారు. ఆయన బుధవారం విజయనగరంలో మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టిందని బొత్స తెలిపారు. ఈ సంతకాల సేకరణ పూర్తయిన తర్వాత త్వరలోనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో గవర్నర్‌ను కలిసి ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం పేదల కోసం అనేక మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం వాటికి కనీస నిధులు కూడా ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. దీనివల్ల మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (MCI) నుంచి అనుమతులు రాకుండా పోయే ప్రమాదం ఉందని బొత్స హెచ్చరించారు.

రాష్ట్రంపై ఉన్న రూ. 2.60 లక్షల కోట్ల అప్పుపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని బొత్స డిమాండ్ చేశారు. నిధులు ఎక్కడ, ఎలా ఖర్చు చేశారో ప్రజలకు వివరించాలని కోరారు. మరోవైపు, గుర్ల మండలంలో ప్రతిపాదించిన స్టీల్ ప్లాంట్ విషయంలో రైతుల అభిప్రాయానికే తమ ప్రాధాన్యత అని బొత్స స్పష్టం చేశారు. రైతులు ఎక్కువ మంది ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తే, వారి పక్షాన పోరాటం కొనసాగిస్తామని ఆయన తేల్చిచెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *