పరకామణి చోరీ కేసు: లోక్ అదాలత్ రాజీపై సీఐడీ అదనపు నివేదిక సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు!

తిరుమల శ్రీవారి పరకామణిలో విదేశీ కరెన్సీ చోరీ కేసులో లోక్ అదాలత్ ద్వారా కుదిరిన రాజీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ (CID) ఈరోజు (మంగళవారం) హైకోర్టుకు అదనపు నివేదికను సీల్డ్ కవర్‌లో సమర్పించింది. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది.

నివేదికకు చెందిన మరో రెండు సెట్లను రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) కు సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ నివేదికలను పరిశీలన నిమిత్తం తమ ముందు ఉంచాలని రిజిస్ట్రీకి సూచించింది. లోక్ అదాలత్ అవార్డు యొక్క చట్టబద్ధతపైనే ప్రధానంగా దృష్టి సారించిన న్యాయస్థానం, నివేదికను పరిశీలించాక తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

గత ఏడాది ఏప్రిల్‌లో టీటీడీ మాజీ ఉద్యోగి రవికుమార్ సుమారు 900 అమెరికన్ డాలర్ల విదేశీ కరెన్సీని చోరీ చేస్తూ పట్టుబడ్డాడు. అయితే, 2023 సెప్టెంబర్‌లో ఈ కేసు లోక్ అదాలత్‌లో రాజీకి రావడం వివాదాస్పదమైంది. రాజీలో భాగంగా నిందితుడు రవికుమార్ రూ.14 కోట్ల విలువైన ఏడు ఆస్తులను టీటీడీకి విరాళంగా ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ రాజీని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా, ఈ కేసులో తొలుత ఫిర్యాదు చేసిన అప్పటి ఏవీఎస్ఓ సతీశ్ కుమార్ అనుమానాస్పద మృతి కేసు తీవ్రతను మరింత పెంచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *