మహారాష్ట్రలో ఇటీవల చిరుతపులుల దాడులు మరియు అవి గ్రామాల్లోకి ప్రవేశించే ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి గణేశ్ నాయక్ శాసనసభలో ఒక వినూత్న ప్రతిపాదన చేశారు. చిరుతపులులు ఆహారం కోసం మానవ నివాసాల్లోకి ప్రవేశించకుండా నిరోధించడానికి అడవుల్లోకి పెద్ద సంఖ్యలో మేకలను వదలాలని ఆయన సూచించారు.
చిరుత దాడుల్లో మనుషులు చనిపోతే ప్రభుత్వం పెద్ద మొత్తంలో పరిహారం చెల్లిస్తోందని మంత్రి గుర్తు చేశారు. మరణించిన తర్వాత పరిహారం చెల్లించే బదులు, ఆ నిధులను వినియోగించి రూ.1 కోటి విలువైన మేకలను అడవిలోకి వదలడం ద్వారా చిరుతలకు అడవిలోనే ఆహారం లభిస్తుందని, తద్వారా అవి మానవ ఆవాసాలలోకి రాకుండా నిరోధించవచ్చని ఆయన అన్నారు.
చిరుతపులుల ప్రవర్తన, జీవన విధానాలు మారిపోయాయని మంత్రి అన్నారు. పూర్వం అటవీ జంతువులుగా మాత్రమే ఉన్న చిరుతలు ఇప్పుడు చెరుకు తోటలను కూడా తమ ఆవాసాలుగా మార్చుకున్నాయని తెలిపారు. అహల్యా నగర్, పుణే, నాసిక్ జిల్లాల్లో చిరుత దాడులు భారీగా పెరిగాయని, ఈ బెడద ఉన్న ప్రాంతాల్లో తమ ప్రభుత్వం త్వరలో ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని మంత్రి శాసనసభలో తెలిపారు.