గత ఐదేళ్ల విధ్వంసకర పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ బయటపడి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో తిరిగి వికాస పథంలోకి ప్రవేశించిందని స్వర్ణాంధ్ర పీ-4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ సి.కుటుంబరావు అన్నారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)కి రూ.7 లక్షల కోట్లకు పైగా తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపించారు. జగన్ పాలనలో ఏపీ జీఎస్డీపీ వృద్ధి రేటు 13.21 శాతం నుంచి 9.1 శాతానికి పడిపోయిందని తెలిపారు.
పొరుగు రాష్ట్రం తెలంగాణతో పోల్చినప్పుడు ఈ తేడా స్పష్టంగా కనిపిస్తోందని కుటుంబరావు వివరించారు. 2019-24 మధ్య తెలంగాణ 11 శాతం వృద్ధిని నమోదు చేయగా, ఏపీ 9.1 శాతానికి పడిపోయింది. దీని ఫలితంగా ఏపీ తలసరి ఆదాయం రూ.2.66 లక్షల వద్ద ఆగిపోగా, తెలంగాణ రూ.3.87 లక్షలకు చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం సక్రమంగా పనిచేసి ఉంటే, ఖజానాకు అదనంగా రూ.72 వేల కోట్లు వచ్చి ఉండేవని ఆయన విశ్లేషించారు.
చంద్రబాబు తిరిగి అధికారం చేపట్టిన 18 నెలల్లోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టారని కుటుంబరావు ప్రశంసించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించిందని, గ్రీన్ ఎనర్జీలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. వ్యవసాయం, పరిశ్రమలు, ఐటీ, టూరిజం వంటి రంగాల్లో నిర్దేశిత లక్ష్యాలను దాటి రాణించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ మాదిరిగా, రాష్ట్రంలో చంద్రబాబు తన దార్శనికతతో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దుతున్నారని ఆయన కొనియాడారు.