గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్ (రైలు నెం. 17243) యొక్క ప్రస్తుత ప్రయాణ సమయాలను మార్చాలని ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రయాణికులు మరియు వలస కూలీలు రైల్వే అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఉపాధి కోసం విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు పెద్ద ఎత్తున వచ్చే దిగువ మధ్యతరగతి ప్రజలకు ఈ రైలు చాలా ముఖ్యం. ముఖ్యంగా ఈ రైలులో 9 జనరల్ బోగీలు ఉండటం వలన తక్కువ ధరలో సొంత ఊళ్లకు వెళ్ళడానికి ప్రయాణికులు దీనికే ప్రాధాన్యత ఇస్తుంటారు.
అయితే, ఈ రైలు గుంటూరు నుండి ప్రతీ రాత్రి 11:20 గంటలకు బయలుదేరి, విజయవాడకు అర్ధరాత్రి 12:05 గంటలకు చేరుకోవడం ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. పిల్లాపాపలతో, సామానుతో అంత రాత్రి పూట ప్రయాణం చేయడం చాలా కష్టంగా ఉందని ఉత్తరాంధ్ర వలస కూలీలు విజ్ఞప్తి చేస్తున్నారు. తమ జీవనోపాధికి అత్యంత ముఖ్యమైన ఈ రైలు ప్రయాణ సమయాలు సరిగా లేకపోవడం వల్ల తాము తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఈ రైలు (అప్పట్లో ప్యాసింజర్ రైలు) విజయవాడలో రాత్రి 9 గంటల ప్రాంతంలో ప్రారంభమయ్యేది. 2018లో దీన్ని ఎక్స్‌ప్రెస్‌గా మార్చి, గుంటూరు వరకు పొడిగించిన తర్వాతే, ఈ ఆలస్య సమయాలను నిర్ణయించారు. అందుకే, మునుపటిలా రాత్రి 9 గంటల ప్రాంతంలో విజయవాడ నుండి బయలుదేరేలా రైలు టైమింగ్స్ మార్చమని ప్రయాణికులు రైల్వే శాఖను కోరుతున్నారు.