తిరుమల శ్రీవారి పరకామణి చోరీపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన ‘చిన్న దొంగతనం’ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు కోట్ల మంది శ్రీవారి భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన విమర్శించారు. “బాబాయి హత్యనే సెటిల్ చేసుకుందామని చూసిన వ్యక్తి, ఇప్పుడు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల పరకామణి చోరీని కూడా సెటిల్ చేయాలని చూడటం కంటే ఘోరం ఉంటుందా?” అని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. దేవుడి హుండీలో చోరీ చేయడం చిన్న తప్పేం కాదని, దాన్ని సెటిల్ చేయడం మహాపాపం అవుతుందని అన్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఎలాంటి మొహమాటాలకు తావులేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ప్రశాంతంగా ఉండే ప్రాంతాలను సైతం నేరమయం చేసిందని, నేరస్తులను పెంచి పోషించిందని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన నెల్లూరు జిల్లాలో పెరిగిన నేర సంస్కృతిపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “నెల్లూరులో ఏకంగా లేడీ డాన్లను తయారు చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు” అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇలాంటి సంస్కృతిని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని, నేరస్తులను ఏరివేస్తామని ఆయన హెచ్చరించారు.
రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెరిగిందని చంద్రబాబు వివరించారు. రైతులతో నిర్వహించిన సమావేశం సత్ఫలితాలనిచ్చిందని, రెండో దశ భూ సమీకరణకు కూడా రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు, రైతులు, ప్రభుత్వం సంతోషంగా ఉంటే కొందరికి కడుపు మండుతోందని పరోక్షంగా జగన్‌ను విమర్శించారు. అదేవిధంగా, ప్రభుత్వం చేపట్టిన ‘మెగా పేరెంట్ టీచర్ మీటింగ్’ ఒక బ్రాండ్‌గా మారిందని, విద్యాశాఖలో మంత్రి నారా లోకేశ్ తీసుకువస్తున్న సంస్కరణలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని ఆయన తెలిపారు.