బీహార్ రాజధాని పాట్నాలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణానికి మార్గం సుగమమైంది. తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) ఆలయ నిర్మాణానికి భూమిని కేటాయించేందుకు బీహార్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు పాట్నాలోని మోకామా ఖాస్ ప్రాంతంలో 10.11 ఎకరాల భూమిని టీటీడీకి కేటాయించినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు.
బీహార్ ప్రభుత్వం ఈ భూమిని కేవలం ఒక్క రూపాయి టోకెన్ లీజు రెంట్‌పై ఏకంగా 99 సంవత్సరాల పాటు టీటీడీకి లీజుకు ఇవ్వనుంది. బీహార్ ప్రభుత్వ ఈ నిర్ణయం పట్ల టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హర్షం వ్యక్తం చేస్తూ, బీహార్ ప్రభుత్వ దూరదృష్టికి, సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నిర్ణయంపై అభినందనలు తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌కు కూడా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఆలయ నిర్మాణానికి సంబంధించిన అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కోసం బీహార్ పర్యాటక శాఖ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్‌ను అధికారికంగా నియమించినట్లు బీఆర్ నాయుడు వివరించారు. త్వరలోనే టీటీడీ ప్రతినిధులు సంప్రదింపులు జరిపి, ఆలయ నిర్మాణానికి సంబంధించిన తదుపరి చర్యలు చేపడతారని ఆయన స్పష్టం చేశారు. దీంతో శ్రీవారి భక్తులకు దేశంలోని మరో ముఖ్యమైన నగరంలో స్వామివారిని దర్శించుకునే అవకాశం లభించనుంది.