తిరుమల పరకామణి చోరీ కేసు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన నేపథ్యంలో, ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రవికుమార్ కీలక వీడియో విడుదల చేశారు. తాను రెండున్నరేళ్ల క్రితం పరకామణిలో తప్పు చేశానని అంగీకరించారు. ఆ తప్పునకు ప్రాయశ్చిత్తంగా తన ఆస్తిలో 90 శాతం స్వామి వారికి రాసిచ్చినట్లు ఆయన తెలిపారు. అయినప్పటికీ, కొంతమంది దీనిపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ, తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని, ఈ మనోవేదనను తట్టుకోలేకపోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తాను పెదజీయర్ స్వామి మఠంలో గుమస్తాగా పని చేశానని, కేబుల్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయని రవికుమార్ వివరించారు. 2023 ఏప్రిల్ 29న చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా స్వామివారికి ఆస్తి రాసిస్తే, “కొందరి ఒత్తిడితో, కొందరికి డబ్బులు ఇచ్చి ఆస్తులు ఇచ్చానని ఏవేవో మాట్లాడుతున్నారు” అని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలను ఖండించిన రవికుమార్, ప్రైవేట్ పార్టులలో శస్త్రచికిత్సలు చేయించుకున్నానని కొంతమంది అసభ్యకరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
గత రెండున్నరేళ్లుగా తాను, తన భార్య పిల్లలు తీవ్ర మనోవేదన చెందుతున్నామని రవికుమార్ పేర్కొన్నారు. డిబేట్లు పెట్టి తమ గురించి అసభ్యంగా మాట్లాడటాన్ని తట్టుకోలేకపోతున్నామని అన్నారు. న్యాయస్థానం ఆదేశిస్తే ఎలాంటి వైద్య పరీక్షలకు అయినా తాను సిద్ధంగా ఉన్నానని, అవన్నీ అవాస్తవాలని స్పష్టం చేశారు. మరోవైపు, ఈ కేసుపై సిట్ (SIT) దర్యాప్తు కొనసాగుతుండగా, పరకామణి చోరీ కేసుపై ఫిర్యాదు చేసిన అప్పటి టీటీడీ ఏవీఎస్‌వో సతీష్ కుమార్ అనుమానాస్పద మృతితో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది.