రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా, ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగిన ద్వైపాక్షిక భేటీలో, వారి మధ్య ఉంచిన ఓ మొక్క ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మొక్క పేరు హెలికోనియా (Heliconia). ఈ మొక్క కేవలం అలంకరణ వస్తువుగా మాత్రమే కాకుండా, సానుకూల శక్తికి (Positive Energy) సూచికగా, శుభప్రదంగా భావించి అక్కడ ఉంచారు.
హెలికోనియా మొక్కలు ఉష్ణమండల ప్రాంతాల్లో పెరుగుతాయి. వాటి ప్రకాశవంతమైన, రంగురంగుల పుష్పాలు ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. సాధారణంగా ఈ మొక్కను ‘లబ్‌స్టర్ క్లా’ (Lobster Claw) లేదా ‘ఫాల్స్ బర్డ్ ఆఫ్ ప్యారడైజ్’ అని కూడా పిలుస్తారు. ఈ మొక్క వాస్తు మరియు ఫెంగ్ షూయ్ శాస్త్రాల్లో సానుకూలత, ఉల్లాసం మరియు ఆనందానికి ప్రతీకగా పరిగణించబడుతుంది. అందుకే, రెండు దేశాధినేతల మధ్య జరిగిన కీలక సమావేశంలో, పరస్పర సహకారం మరియు స్నేహబంధాన్ని పెంపొందించే సంకేతంగా దీన్ని ఉంచారు.
భారత్, రష్యా మధ్య జరిగిన ఈ భేటీలో మొత్తం 11 కీలక ఒప్పందాలు కుదిరాయి. ఆరోగ్యం, ఆహార భద్రత, నౌకాయానం, ఎరువులు, విద్య, నిపుణులైన కార్మికుల వలస వంటి రంగాల్లో సహకారం పెంపునకు ఈ ఒప్పందాలు దోహదపడనున్నాయి. ఈ కీలక చర్చల మధ్య హెలికోనియా మొక్కను ఉంచడం అనేది ఇరు దేశాల మధ్య మైత్రి, సానుకూల సంబంధాలు చిరకాలం కొనసాగాలనే ఉద్దేశాన్ని సూచిస్తుంది.