ఉత్తర ఐరోపా దేశమైన లాత్వియా (Latvia) లో విచిత్రమైన సామాజిక పరిస్థితి నెలకొంది. ఇక్కడ పురుషుల కొరత కారణంగా, పెళ్లి చేసుకోవడానికి లేదా ఇంటి పనుల్లో సహాయం చేయడానికి భాగస్వాములు దొరకడం లేదు. ఈ కారణంగా, అక్కడి మహిళలు ఇంటి పనుల్లో చేదోడు వాదోడుగా ఉండేందుకు, పురుషులను గంటలు లేదా రోజులు లెక్కన ‘అద్దె భర్తలు’ (Rental Husbands) గా తీసుకుంటున్నారు. లింగ నిష్పత్తిలో భారీ తేడా ఉండటం వల్లే ఈ వింత పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు.
లాత్వియా దేశంలో పురుషుల జనాభా కంటే మహిళల జనాభా 15.5 శాతం అధికంగా ఉంది. అంటే, ప్రతి 100 మంది పురుషులకు 115 మంది స్త్రీలు ఉన్నారు. నిపుణుల అంచనా ప్రకారం, పురుషులలో అధిక ధూమపానం, స్థూలకాయం, మరియు ఆరోగ్యంపై తక్కువ శ్రద్ధ వంటి కారణాల వల్ల వారి జీవితకాలం మహిళలతో పోలిస్తే గణనీయంగా తక్కువగా ఉంది. దీని ఫలితంగా దేశంలో మగవారి కొరత పెరిగి, యువతులు, ఉద్యోగస్తులు సైతం భాగస్వాములు దొరకడంలో ఇబ్బంది పడుతున్నారు.
ఈ పురుషుల కొరతను అధిగమించేందుకు, అనేక మంది మహిళలు ఇంటి మరమ్మతులు, ప్లంబింగ్, కార్పెంట్రీ, లేదా ఇతర చిన్నచిన్న యాంత్రిక పనుల కోసం ప్రత్యేక సేవలను ఆశ్రయిస్తున్నారు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ‘Husband for an Hour’ వంటి సేవలను బుక్ చేసుకుని, ఇంటి పనుల్లో సహాయం పొందుతున్నారు. ఈ అద్దె భర్తలు కేవలం ఇంటి పనులు పూర్తి చేయడానికే పరిమితమవుతారు. ఈ వినూత్న సేవలు లాత్వియాలో బాగా ప్రాచుర్యం పొందాయి.