తమిళనాడు రాష్ట్రం రామనాథపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు దుర్మరణం పాలయ్యారు. రామేశ్వరం దర్శించుకుని తిరిగి వస్తుండగా, రామనాథపురం జిల్లాలోని కీజక్కరై వద్ద వీరు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న మరో కారు అతివేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి.
ఈ విషాదకర ఘటనలో కారులో ఉన్న ఐదుగురు అయ్యప్ప భక్తులు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన కీజక్కరై పోలీసులు, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు.
మృతులు ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కోరపు కొత్తవలస మరియు గజపతినగరం మండలం మరుపల్లి గ్రామాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటన కారణంగా ఐదు కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.