నాలుగేళ్ల తర్వాత భారత్ పర్యటనకు విచ్చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కోసం ఢిల్లీలోని విలాసవంతమైన ఐటీసీ మౌర్య హోటల్‌లో ‘చాణక్య సూట్’ ను సిద్ధం చేశారు. పుతిన్ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈ అత్యంత లగ్జరీ సూట్‌లో బస చేయనున్నారు. ఈ నేపథ్యంలో హోటల్ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అమలు చేస్తున్నారు. పుతిన్ టూర్ మార్గంలో ఇప్పటికే 4 డజన్లకు పైగా రష్యా భద్రతా బలగాలు, భారత ఎన్‌ఎస్‌జీ కమెండోలు గస్తీ కాస్తున్నారు.
4,600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ చాణక్య సూట్‌కు ఒక రాత్రి అద్దె రూ. 8 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఉంటుందని అంచనా. ప్రాచీన భారతీయ రాజసం మరియు ఆధునిక సౌకర్యాలు మేళవించిన ఈ సూట్‌లో సిల్క్ ప్యానెల్ గోడలు, డార్క్ వుడ్ ఫ్లోరింగ్, టైయబ్ మెహ్తా చిత్రాలు మరియు అర్థశాస్త్ర ప్రేరణతో తయారైన కళాఖండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇందులో వాక్-ఇన్ క్లాసెట్‌తో మాస్టర్ బెడ్‌రూమ్, ప్రైవేట్ స్టీమ్ రూమ్/సౌనా, పూర్తిస్థాయి జిమ్, 12 సీట్ల డైనింగ్ రూమ్ వంటి అత్యున్నత సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
గత 40 ఏళ్లుగా విదేశీ ప్రముఖులు, దేశాధినేతల ఇష్టమైన వసతి కేంద్రంగా ఐటీసీ మౌర్య హోటల్ నిలుస్తోంది. 411 గదులు, 26 సూట్‌లు ఉన్న ఈ హోటల్‌లో, చాణక్య సూట్ మాత్రం అత్యంత ప్రతిష్టాత్మక అతిథుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఢిల్లీ నగర దృశ్యాలను చూపించే ప్రత్యేక వ్యూ ఈ సూట్ యొక్క అదనపు ఆకర్షణ. ఈ సూట్ చారిత్రక భారతీయ ఘనతను ఆధునిక సౌకర్యాలతో మేళవించే విధంగా ఉన్నట్లు హోటల్ వర్గాలు చెబుతున్నాయి.