కూటమి ఐక్యతతోనే సుస్థిర అభివృద్ధి: వర్షించని మేఘం, శ్రమించని మేధావి ఉన్నా ఒకటే – డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిత్తూరు జిల్లా రెడ్డిగుంట వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన డివిజనల్ డెవలప్‌మెంట్ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా కీలక ప్రసంగం చేశారు. “వర్షించని మేఘం, శ్రమించని మేధావి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే” అన్నట్లుగా, కూటమి ప్రభుత్వానికి ఇంత ప్రజాబలం ఉన్నా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవస్థల్లో సమూల మార్పులు తేలేకపోతే తమ పదవులన్నీ నిష్ప్రయోజనమే అని ఆయన స్పష్టం చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో మార్పుల కోసమే రాష్ట్రవ్యాప్తంగా 77 డీడీఓ కార్యాలయాలను ప్రారంభించామని తెలిపారు. అంతేకాక, 10 వేల మంది పంచాయతీరాజ్ ఉద్యోగులకు ఎలాంటి పైరవీలకు తావు లేకుండా అర్హత ఆధారంగా పదోన్నతులు కల్పించినట్లు ఆయన వివరించారు.

కూటమిలోని మూడు పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ‘రాష్ట్రం బాగుండాలి – అరాచకాలు ఉండకూడదు’ అనే ఉమ్మడి లక్ష్యంతో ఒక గొడుగు కిందకు వచ్చారని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. “మన ఐక్యత వల్లే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో మనం బలమైన శక్తిగా నిలబడగలిగాం, నామినేటెడ్ పదవులు ఇవ్వగలుగుతున్నాం” అని ఆయన అన్నారు. నాయకుల మధ్య చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్‌లు ఉంటే కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. ఇదే స్ఫూర్తి మరో 15 ఏళ్లపాటు కొనసాగితేనే రాష్ట్రానికి సుస్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆకాంక్షించారు.

‘పదవి అనేది బాధ్యత తప్ప అలంకారం కాదు’ అని స్పష్టం చేసిన పవన్, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని తీవ్రంగా విమర్శించారు. శేషాచలం అడవుల్లో దోచిన సంపదలో దొరికింది కేవలం 10 శాతం మాత్రమేనని, దాని విలువే వేల కోట్లు ఉంటే, దొరకని సంపద విలువ ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చని ఆయన అన్నారు. అవినీతిని అరికట్టి, బలహీనుల గొంతుకగా నిలవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. “సమాజంలో కోల్పోయిన ధైర్యాన్ని నింపడమే జనసేన లక్ష్యం” అని, కష్టపడిన ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకుని గౌరవిస్తామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *