‘ఐబొమ్మ’ రవి సంచలన కథ: పోలీసుల ‘టెక్నికల్ ఆఫర్’ను తిరస్కరించి, కరేబియన్ దీవుల్లో ‘iBomma’ రెస్టారెంట్ ఆలోచన!

పైరసీ కేసులో అరెస్ట్ అయిన ‘iBomma’ రవి (ఎమ్మాది రవి) విచారణలో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొత్త సినిమాలను దొంగిలించి అప్‌లోడ్ చేయడంలో రవికి ఉన్న అసాధారణ సాంకేతిక నైపుణ్యాన్ని గుర్తించిన పోలీసులు, అతనికి సైబర్ క్రైమ్ విభాగంలో మంచి జీతంతో ఉద్యోగం ఇవ్వాలని ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే, రవి మాత్రం ఈ ‘టెక్నికల్ ఆఫర్‌’ను ఏ మాత్రం ఆలోచించకుండా తిరస్కరించినట్లు తెలుస్తోంది.

కస్టడీలో పోలీసులు రవిని అతని భవిష్యత్ ప్రణాళికలను అడిగినప్పుడు, అతను ఆశ్చర్యకరమైన కలలను వివరించాడు. iBomma సైట్ మూసుకుపోయిన తరువాత, తాను కరేబియన్ దీవుల్లో ఒక రెస్టారెంట్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నానని, దానికి కూడా ‘iBomma’ అనే పేరే పెట్టాలని భావిస్తున్నట్లు తెలిపాడు. అక్కడి ప్రజలకు భారతీయ వంటకాలను పరిచయం చేసి డబ్బు సంపాదించి, భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా iBomma రెస్టారెంట్ల శ్రేణిని ప్రారంభించాలని తన లక్ష్యాన్ని పోలీసులకు వివరించాడు.

పైరసీ ద్వారా సంపాదించిన ₹20 కోట్లలో రవి ఇప్పటికే ₹17 కోట్లు విలాసవంతమైన జీవితం కోసం ఖర్చు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా, ₹80 లక్షలు ఖర్చు చేసి సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పౌరసత్వం కూడా రవి పొందినట్లు విచారణలో తేలింది. వారానికి ఒక దేశం తిరుగుతూ, తనకు నచ్చినట్లు జీవించాలని అతను పోలీసులకు చెప్పాడు. రవి ఖాతాల్లో ఉన్న ₹3 కోట్లు, అలాగే హైదరాబాద్‌లోని ఫ్లాట్, విశాఖపట్నంలోని ఆస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *