సినిమా రంగంలో పని గంటలపై జరుగుతున్న చర్చపై టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా (Rana Daggubati) స్పందించారు. బాలీవుడ్ నటి దీపికా పడుకొణే రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తానని స్పష్టం చేసిన నేపథ్యంలో, రానా తన అభిప్రాయాన్ని ఘాటుగా వెల్లడించారు. “సినిమా రంగం సాధారణ ఉద్యోగం లాంటిది కాదు. నటన అనేది ఒక ఉద్యోగం కాదు. అది లైఫ్‌స్టైల్. ఎనిమిది గంటలు కూర్చొని అద్భుతమైన అవుట్‌పుట్ వచ్చే ఫీల్డ్ ఇది కాదు” అని ఆయన అన్నారు.
ఒక గొప్ప సీన్ రావాలంటే కెమెరా నుంచి లైటింగ్ వరకు, నటీనటుల నుంచి టెక్నీషియన్లవరకూ అందరూ సమయం పట్టించుకోకుండా పనిచేయాల్సిన అవసరం ఉందని రానా స్పష్టం చేశారు. సినిమాలు తయారయ్యే ప్రక్రియ మొత్తం ఒక టీమ్ యొక్క అంకితభావంపై ఆధారపడి ఉంటుందని, ఇక్కడ 8 గంటల రూల్ పెట్టేయడం ప్రాక్టికల్‌గా కరెక్ట్ కాదని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు, నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) కూడా ఈ చర్చలో పాల్గొంటూ, “వివిధ పరిశ్రమలలో వర్క్ మోడల్ వేరు వేరుగా ఉంటుంది. ఒకేరోజు అతిగా పనిచేయడం కంటే, రోజూ కొంచెం అదనంగా పనిచేయడం బెస్ట్” అని అభిప్రాయపడ్డారు. తెలుగులో ‘మహానటి’ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు సాయంత్రం ఆరు గంటలకే ఇంటికి వెళ్లే అవకాశం ఉండేదని ఆయన తన అనుభవాన్ని పంచుకున్నారు.