ఆంధ్రప్రదేశ్‌లో దేశంలోనే తొలిసారిగా అపెక్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ నేచురోపతిని విశాఖపట్నంలో ₹750 కోట్లతో నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది. ఈ సంస్థ ఎయిమ్స్ తరహాలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. దీనికి అనుబంధంగా 450 పడకలతో కూడిన నేచురోపతి (ప్రకృతి) ఆసుపత్రి కూడా నిర్మించనున్నారు.
ఈ అపెక్స్ ఇన్‌స్టిట్యూట్‌తో పాటు, యోగా మరియు నేచురోపతి పరిశోధనలకు సంబంధించి గుంటూరు జిల్లాలో కూడా మరో ప్రత్యేక పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. గుంటూరు జిల్లా నడింపాలెంలో సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నేచురోపతి (CRIYN) ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్‌రావ్ జాదవ్ రాజ్యసభలో తెలిపారు.
ఈ ప్రాజెక్టును ₹93.82 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు పరిపాలన, వ్యయపరమైన అనుమతులు ఇప్పటికే మంజూరయ్యాయని తెలిపారు. ఈ యోగా రీసెర్చ్ కేంద్రానికి అనుబంధంగా 100 పడకల ఆసుపత్రిని కూడా నిర్మిస్తామని, ఈ ఖర్చును పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే 15 ఎకరాల భూమిని కేటాయించిందని ఆయుష్ మంత్రి వివరించారు.