బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ తెలంగాణలో రాజకీయాలు చేసుకోవచ్చని, ఆయనను ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. అయితే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని విమర్శిస్తే మాత్రం ఉపేక్షించేది లేదని, ఈ విషయంలో తీవ్రంగా హెచ్చరించారు.
గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి, కేటీఆర్‌కు రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి, ప్రశ్నించే హక్కు లేదని మండిపడ్డారు. రాహుల్ గాంధీది త్యాగాల కుటుంబం అని, అయితే కేసీఆర్ కుటుంబం మాత్రం తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడే రాజకీయ లబ్ధి పొందిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విలువల్లేని రాజకీయాలు ఏమాత్రం మంచిది కాదని హితవు పలికిన జగ్గారెడ్డి, కేటీఆర్‌కు నైతిక విలువలు ఉంటే రాహుల్ గాంధీ గురించి మరోసారి ఇష్టానుసారంగా మాట్లాడవద్దని అన్నారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అని, బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ అని గుర్తుచేస్తూ, కేటీఆర్ తెలంగాణ రాజకీయాలకే పరిమితం కావాలని ఆయన తేల్చి చెప్పారు.