పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం మరియు ఉనికిపై గత నెల రోజులుగా నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఇమ్రాన్ ఖాన్ రావల్పిండిలోని అదియాలా జైల్లోనే ఉన్నట్లు ధృవీకరణ లభించింది. ఆయన సోదరి డాక్టర్ ఉజ్మా ఖాన్‌కు ఇమ్రాన్‌తో భేటీ అయ్యేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో, ఆయన జైల్లోనే మరణించారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సాగుతున్న వదంతులకు ఫుల్‌స్టాప్ పడింది.
గత 25 రోజులుగా ఇమ్రాన్ ఖాన్ బయటి ప్రపంచానికి కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్యంపై తీవ్ర ఆందోళనలు, మరణ వార్తల వదంతులు మొదలయ్యాయి. ఆయన జనాదరణకు ప్రభుత్వం భయపడుతోందని, అందుకే ఆయనను ఏకాకిని చేసి, దేశం విడిచి వెళ్లేలా ఒత్తిడి తెస్తున్నారని ఆయన పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) ఆరోపించింది.
ఈ నేపథ్యంలో, ఇమ్రాన్ ఖాన్‌కు న్యాయం చేయాలని కోరుతూ ఆయన పార్టీ కార్యకర్తలు ఇస్లామాబాద్ హైకోర్టు వద్ద నిరసనలు చేపట్టారు. ప్రభుత్వం పెద్ద సభలపై నిషేధం విధించినప్పటికీ, నిరసనలు కొనసాగాయి. ఈ పెరిగిన ఒత్తిడితో ప్రభుత్వం దిగివచ్చి, ఆయన సోదరిని కలిసేందుకు అనుమతి ఇచ్చింది.