భారత్‌లోనే తొలి 16 అంతస్తుల రైల్వే స్టేషన్‌: అహ్మదాబాద్‌లో మల్టీ మోడల్ హబ్ నిర్మాణం

మన దేశంలో తొలిసారిగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 16 అంతస్తుల రైల్వే స్టేషన్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇది కేవలం రైల్వే స్టేషన్‌ మాత్రమే కాకుండా, బుల్లెట్ రైలు, మెట్రో ట్రైన్, సాధారణ రైలు, మరియు బస్ సేవలను ఒకే చోట అందించే మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా (MMTH) పనిచేయనుంది. రోజుకు లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించే భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది.

ఈ అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ భవనం రూపకల్పనలో ప్రత్యేకతలు ఉన్నాయి. స్టేషన్ పైకప్పు వందలాది గాలిపటాలను పోలి ఉండేలా నిర్మిస్తున్నారు. అలాగే ముందుభాగం అహ్మదాబాద్ చారిత్రక సిదీ సయ్యద్ జాలీ లాటిస్ వర్క్ స్ఫూర్తితో తీర్చిదిద్దబడుతోంది. ఈ స్టేషన్ నేరుగా కాలుపూర్ మెట్రో స్టేషన్‌కు అనుసంధానించబడుతుంది. జపాన్ సహకారంతో అభివృద్ధి చేస్తున్న ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్‌కు ఇది ప్రధాన కేంద్రంగా ఉంటుంది.

ఈ మల్టీ మోడల్ రవాణా కేంద్రం ప్రయాణికుల రాకపోకలు సులభతరం చేయడంతో పాటు, అహ్మదాబాద్ స్థానిక వ్యాపారం, పర్యాటకం, మొత్తం ఆర్థిక అభివృద్ధికి గణనీయమైన ప్రోత్సాహాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. ఈ స్టేషన్‌లో విశాలమైన పార్కింగ్ ప్రాంతాలు, కార్పొరేట్ కార్యాలయాలు, షాపులు, మాల్స్ వంటి కమర్షియల్ కేంద్రాలు కూడా ఉంటాయి. రైల్వే అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 2027 జూలై నాటికి పూర్తి అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *