పీపుల్స్‌స్టార్ నారాయణమూర్తిగారు నటించిన సినిమాలు అద్భుతంగా ఆడుతున్న తరుణమది. ఎంతోమంది నిర్మాతలు ఆయనతో సినిమాలు చేయడానికి పోటీ పడుతున్నప్పటికీ తనకు సాయం చేసిన కొంతమంది మిత్రులకు సినిమాలు చేసి వారికి ఆర్థికంగా లాభం చేకూర్చాలని నారాయణమూర్తిగారు నిర్ణయించుకున్నారని విన్నాను. అలా పోకూరి బాబూరావుగారికి ఒక సినిమా చేయడానికి అంగీకరించారాయన. సబ్జెక్ట్ రెడీ చేసి నా దగ్గరకు వచ్చి ‘సుబ్బన్నా.. నారాయణమూర్తితో చేయాలి మనం’ అన్నారు బాబూరావుగారు. ఆ ప్రపోజల్ విని ఆశ్చర్యపోయా.
‘నేను నారాయణమూర్తి సినిమా చేయడం ఏమిటి? ఆయన స్కూల్ వేరు, నా స్కూల్ వేరు. అలాంటి సినిమాలు ఎప్పుడూ చేయలేదు. ఆయన సినిమాలో ఎమోషనల్‌గా ఉంటాయి. నావి సాఫ్ట్, సెంటిమెంట్ చిత్రాలు. ఎలా మ్యాచ్ అవుతుంది. నేను చేయలేను గురువా’ అని చెప్పినా బాబూరావుగారు వినిపించుకోలేదు. ‘టి.కృష్ణ తర్వాత నా బేనరులో ఎక్కువ సినిమాలు తీసిన దర్శకుడివి నువ్వే సుబ్బన్నా.. కాదంటే ఎలా’ అని నా మీద గట్టిగా వత్తిడి తెచ్చాడు. చివరకు తప్పనిసరి పరిస్థితుల్లో ‘ఎర్రోడు’ సినిమా చేయడానికి అంగీకరించా. మంచి మనసుతో నారాయణమూర్తి ‘ఎర్రోడు’ సినిమా చేయడానికి ముందుకు వచ్చినా, మేం ఆయనకు హిట్ ఇవ్వలేకపోయాం. నారాయణమూర్తికి డ్యూయెట్లు అవీ పెట్టి కాస్త మోడరన్‌గా చూపించాలని మేం చేసిన పిచ్చి పని సినిమాను దెబ్బతీసింది. ఈ సినిమా వల్ల లాభపడింది ఎవరయ్యా అంటే నిర్మాత బాబూరావే. మంచి రేట్లకు సినిమా అమ్మారు. పాత సినిమాలకంటే ‘ఎర్రోడు’ సినిమాతోనే ఎక్కువ లాభాలు పొందారాయన, మంచి కథ. మేం చెప్పినట్లల్లా నటించి కోపరేట్ చేసేవారు నారాయణమూర్తిగారు.
అలా సినిమా తర్వాత సినిమా చేసుకుంటూ వెళుతున్నాను. ఏ దర్శకుడికైనా హిట్లు వస్తుంటే అతనితో సినిమాలు తీయడానికి నిర్మాతలు, చేయడానికి హీరోలు ఆసక్తి కనబరుస్తారు. ఇది తిరుగులేని నిజం. అలాగే నా కెరీర్‌లోనూ జరిగింది. ప్రతి సినిమా ఆడాలనే కష్టపడతాం. కానీ కొన్ని సినిమాలు ఆడతాయి. మరి కొన్ని ఆడవు. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. హిట్లు, ఫ్లాపులు ఎవరికైనా సహజమే. అయితే అపజయం అనే చీకటి కమ్మేసే లోపల విజయం అనే వెలుగు వచ్చి కాపాడేది. అలా ముందుకు వెళుతున్న తరుణంలో మోహన్‌బాబుగారితో మరో సినిమా చేసే అవకాశం లభించింది.
(ఇంకా ఉంది)
– వినాయకరావు