సమంత వివాహం ‘భూత శుద్ధి వివాహం’: ఇద్దరి మధ్య ఆధ్యాత్మిక ఐక్యతే లక్ష్యం

కథానాయిక సమంత రూత్ ప్రభు – దర్శకుడు రాజ్ నిడిమోరు వివాహం ఈషా యోగ కేంద్రంలో సంప్రదాయ ‘భూత శుద్ధి వివాహం’ ద్వారా జరిగింది. ఈ పవిత్ర కర్మకాండ భావాలు, ఆలోచనలు, భౌతిక అంశాలకు అతీతంగా, దంపతుల మధ్య ఆధ్యాత్మికంగా మరింత గాఢమైన అనుబంధాన్ని ఏర్పరచే విధానంగా భావించబడుతుంది. ఈ వివాహాలు లింగ భైరవి ఆలయం సహా కొన్ని ప్రత్యేక దేవాలయాల్లో నిర్వహిస్తారు.

సద్గురు స్థాపించిన ఈషా యోగా కేంద్రంలోని లింగ భైరవి ఆలయం ఈ భూత శుద్ధి వివాహాలకు ప్రధాన కేంద్రంగా ఉంది. దీని ప్రధాన ఉద్దేశ్యం దంపతుల మధ్య జీవితాంతం నిలిచే అర్థం, అనుబంధం, సహజీవనంలో ఆధ్యాత్మిక సమతుల్యతను స్థాపించడమే. సాంప్రదాయ రీతిలో జరిగే వివాహాలకన్నా ఈ విధానం మరింత లోతైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుందని ఇషా సంప్రదాయం చెబుతుంది.

వివాహ సమయంలో మంత్రోచ్చారణలు, ప్రత్యేక హోమాలు, శక్తిపీఠం ముందు పూజలు నిర్వహించబడతాయి. ఇలా జరిగిన భూత శుద్ధి వివాహం కేవలం రెండు వ్యక్తుల మధ్య బంధమే కాకుండా, ఆధ్యాత్మిక పరిపక్వతకు, అంతర్గత శాంతికి, పరస్పర గౌరవానికి మార్గదర్శకంగా నిలుస్తుందని భక్తులు విశ్వసిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *