ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన కౌలు రైతు బానోతు వీరన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలో కలకలం రేపింది. ఆత్మహత్య చేసుకునే ముందు వీరన్న సెల్ఫీ వీడియో తీస్తూ, పండించిన పంటకు ధర రాక, అప్పులు తీర్చే దారి లేక చనిపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలని, సబ్సిడీలు ఇవ్వాలని కోరుతూ తీసిన ఈ సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కౌలు రైతు వీరన్న ఆత్మహత్యపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. ఇది కేవలం ఆత్మహత్య కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయని కారణంగా, ఆర్థిక తోడ్పాటు లేక, అప్పులు భారమై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపిస్తూ, ఇది ప్రభుత్వం చేసిన “హత్య” అని ఆయన దుయ్యబట్టారు. ఎన్నికలకు ముందు కౌలు రైతులకు రైతుభరోసా ఇస్తామని బాండ్లు రాసిచ్చి, ఇప్పుడు వారి బతుకులకు భరోసా లేకుండా చేశారని ఆయన విమర్శించారు.
సెల్ఫీ వీడియోలో రైతు వీరన్న చెప్పిన మాటలకైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి చలనం వస్తుందా? అని హరీష్ రావు ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఖమ్మం జిల్లా పర్యటనలో కౌలు రైతు వీరన్న కుటుంబాన్ని పరామర్శించి, ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని విన్నవించిన హరీష్ రావు, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా బీఆర్‌ఎస్ పార్టీ కలిసి పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు.