కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి పార్లమెంట్ శీతాకాల సమావేశాల మొదటి రోజు (డిసెంబర్ 1) తన పెంపుడు కుక్కను కారులో పెట్టుకొని పార్లమెంట్ భవనం వద్దకు తీసుకురావడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఆమె కారులో కుక్కపిల్ల ఉన్న వీడియో బయటకు రావడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. బీజేపీ దీనిని పార్లమెంటు గౌరవానికి భంగం కలిగించడంగా పేర్కొంటూ, ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ఈ ఘటనపై మీడియా రేణుకా చౌదరిని ప్రశ్నించగా, ఆమె ఎదురుదాడి చేస్తూ ఈ విషయాన్ని అనవసరంగా పెద్దది చేస్తున్నారని అన్నారు. ఆమె మాట్లాడుతూ, “ఇందులో ఏముంది? ఒక మూగ జంతువు లోపలికి వస్తే ఏమవుతుంది? ఇది చిన్నది, కరవదు కూడా” అని వ్యాఖ్యానించారు. ఈ చర్యను పెద్దది చేయడంపై ఆమె మండిపడ్డారు.
తన వ్యాఖ్యలను కొనసాగిస్తూ రేణుకా చౌదరి సంచలన ప్రకటన చేశారు. “పార్లమెంటులోనే కరిచే వారు చాలా మంది ఉన్నారు” అంటూ ఆమె ఘాటుగా విమర్శించారు. ఆమె చేసిన ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో వివాదాన్ని మరింత ముదరబెట్టింది. బీజేపీ ఈ వ్యాఖ్యలను ‘ప్రజాస్వామ్యానికే అవమానం’గా అభివర్ణించింది.