తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. తొలి విడత మాదిరిగానే ఎక్కువగా ఏకగ్రీవాలు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాన పార్టీలు తమ మద్దతు దారులను ఏకగ్రీవాల వైపు మొగ్గు చూపేలా చేశారు. శనివారంతో తొలి విడత నామినేషన్ల ఘట్టం ముగిసింది.
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. ముగిసిన తొలి విడత నామినేషన్లు
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కోలాహలంగా మారాయి. తొలి విడత నామినేషన్లు శనివారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో భారీగా అభ్యర్థులు దరఖాస్తులు చేశారు. రాత్రి 10 గంటలకు వివిధ ప్రాంతాల్లో దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. సర్పంచి స్థానాలకు 20 వేలు, వార్డు సభ్యులకు 50 వేలకు పైగా నామినేషన్లు దాఖలైనట్టు అధికారులు చెబుతున్నారు.
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు తొలి విడత నామినేషన్ల ఘట్టం ముగిసింది. తొలివిడతలో 4,236 పంచాయతీలు, 37,440 వార్డులకు ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ చివరిరోజు శనివారం రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. నామినేషన్ల దాఖలుకు సాయంత్రం ఐదు గంటల వరకే గడువు ఉంది.
ఆదివారం నుంచి రెండో విడత నామినేషన్ల ఘట్టం
పలు జిల్లాల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తరలివచ్చారు. 5 గంటల లోపు వచ్చిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ ప్రక్రియ అంతా పూర్తి అయ్యేసరికి రాత్రి పది గంటలు అయినట్టు అధికారులు చెబుతున్నారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో సర్పంచులు, వార్డు స్థానాలకు పార్టీల మద్దతుదారులు భారీ సంఖ్యలో నామినేషన్లు వేశారు. అభ్యర్థులకు టోకెన్లు ఇచ్చి నంబర్ల వారిగా దరఖాస్తులు స్వీకరించారు అధికారులు.
చివరిరోజు 20 వేల మంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ, ఆ సంఖ్య మరింత పెరగనుంది. దాఖలైన నామినేషన్లను ఆదివారం అధికారులు పరిశీలించి, చెల్లుబాటు అయ్యే నామినేషన్ల వివరాలను ఇవాళ ప్రకటించనున్నారు. అప్పీళ్లకు డిసెంబరు ఒకటి వరకు గడువు ఉండగా, నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ మూడు వరకు సమయం ఉంది.
అదే రోజు పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తారు. తొలి విడత గ్రామ పంచాయతీలకు పోలింగ్ డిసెంబరు 11న జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు పోలింగ్ జరగనుంది. ఆ రోజు ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు.
ఆదివారం నుంచి రెండో విడత నామినేషన్ల ఘట్టం మొదలుకానుంది. దీనికి సంబంధించిన ఎన్నిక డిసెంబరు 14న జరగనుంది. రెండో విడతలో 4,333 గ్రామపంచాయతీలు, 38,350 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. దీనికి కోసం భారీగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. మొత్తానికి మూడు విడతలు నామినేషన్లు ఘట్టం ముగిసేసరికి సగానికి పైగానే ఏకగ్రీవకం కావచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు