మహారాష్ట్ర రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కొన్ని గంటల పాటు కురిసిన వర్షం కారణంగా పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఫలితంగా పలువురు తమ ఇళ్లను వదిలేసి, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత రాత్రి నుంచి ముంబైలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుతోంది. నగరంలోని గాంధీ మార్కెట్‌లో నీరు నిలిచిపోయింది. భారీ వర్షాలు రైలు సేవలకు కూడా ఆటకం కలిగిస్తున్నాయి. పలు రైల్వే ట్రాక్‌లు నీటమునిగాయి. భారీ వర్షాల నేపధ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపడుతున్నారు. నగరంలోని హనుమాన్ నగర్ ప్రాంతంలోని ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. దీంతో ఈ కాలనీ వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.