తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల సందడి కనిపిస్తోంది. మూడు విడతల్లో ఎన్నికల జరగనుండడంతో ఆశావహులు పోటీకి సిద్ధమవుతున్నారు. మొదటి విడత ఎన్నికలకు నవంబర్ 27 నుంచి నామినేషన్లు ప్రారంభం అయ్యాయి. అయితే పలు గ్రామాల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవం చేసుకుంటున్నారు. పంచాయతీ ప్రెసిండెంట్ పదవి కోసం కోట్లు కూడా ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. రాజ్యాంగబద్ధంగా ఓటు హక్కుతో రావాల్సిన పదవులను వేలంలో లక్షలు పోసి కొనుక్కుంటున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సర్పంచ్ పదవులను వేలంలో దక్కించుకుంటున్నారు. సర్పంచ్ పదవి కోసం మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం టంకర గ్రామంలో రూ.కోటి వరకు ఖర్చు చేస్తానని ఓ వ్యక్తి ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది. నవాబుపేట మండలం దొడ్డిపల్లి సర్పంచి, ఉప సర్పంచి పదవులను ఏకగ్రీవం అయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం మిట్టదొడ్డి సర్పంచి పదవిని ఓ సీడ్ ఆర్గనైజర్ రూ.90 లక్షలకు ఏకగ్రీవం చేసుకున్నట్లు తెలుస్తోంది. గట్టు మండలం గోర్లాఖాన్‌దొడ్డిలో రూ.57 లక్షలకు, లింగాపురం రూ.34 లక్షలకు వేలంలో సర్పంచ్ పదవులను ఏకగ్రీవం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
లక్షల్లో వేలం
గద్వాల మండలం కొండపల్లిలో రూ.60 లక్షలకు ఓ సీడ్ ఆర్గనైజర్ వేలంతో పదవిని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. నల్లదేవునిపల్లిలో రూ.45 లక్షలకు ఏకగ్రీవం చేసుకుని, రూ.15 లక్షలు అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరాపురంలో రూ.50 లక్షలకు, మల్దకల్ మండలం సద్దలోనిపల్లి సర్పంచి పదవిని రూ.42 లక్షలకు ఏకగ్రీవం చేసినట్లు సమాచారం. ఖమ్మం జిల్లాలో తమ గ్రామ సర్పంచి పదవిని ఓ వ్యక్తి రూ.20 లక్షలకు వేలం పాడుకున్నాడు. కామేపల్లి మండలం జోగ్గూడెం తండాలో సర్పంచ్ సీటు ఈసారి ఎస్టీ మహిళకు కేటాయించారు. తండాలో 8 వార్డుల్లో 793 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ రెండో విడతలో ఎన్నికలు జరగనున్నాయి.
రూ.20 లక్షలకు సర్పంచ్ పదవి
ఈ నేపథ్యంలో శుక్రవారం బహిరంగ వేలంలో ఏడుగురు అభ్యర్థులు సర్పంచ్ పదవి కోసం పోటీపడగా..రూ.5,16,000 నుంచి వేలం మొదలైంది. చివరికి రూ.20 లక్షలకు సైదమ్మ భర్త భూక్యా లక్ష్మణ్ పదవి పాడుకున్నారు. ముందుగా రూ.5 లక్షలు, 30న మిగిలిన రూ.15 లక్షలు గ్రామపెద్దలు సూచించారు. అయితే పోటీదారుడు పూర్తి సొమ్ము చెల్లించలేకపోతే రెండో వేలందారుడికి అవకాశం ఇస్తామని గ్రామ పెద్దలు ఒప్పందపత్రం రాసుకున్నారు. ఉప సర్పంచి, వార్డు సభ్యుల పదవులపై కూడా అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది.