పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆదివారం జరగనుంది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన వర్చువల్‌గా ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. కాగా, కరోనా వ్యాక్సినేషన్‌లో కేంద్ర ప్రభుత్వం విఫలమయిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఒక్కో రాష్ట్రానికి ఒక్కోవిధంగా టీకాలను పంపిణీ చేస్తున్నారని విమర్షిస్తున్నది. దేశంలో కొవిడ్ సెకండ్ వేవ్‌కు ప్రధాని తీసుకున్న నిర్ణయాలే కారణమని ఆరోపణలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఎలా వ్యవహరించాలనే విషయాలను చర్చించే అవకాశం ఉన్నది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 19న ప్రాంభమై ఆగస్టు 13 వరకు కొనసాగుతాయి. మొత్తం 19 పనిదినాల్లో ఉభయసభల కార్యకలాపాలు జరుగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్నాయి. పార్లమెంట్ ఉభయసభలకు (లోక్‌సభ, రాజ్యసభ) ఇవే సమయాలు వర్తిస్తాయి. కరోనా మూడో వేవ్ తప్పదని పేర్కొంటున్న నేపథ్యంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి.