కర్ణాటక పాలకపక్షంలో రాజకీయాలు తారాస్థాయికి చేరాయా? సీఎం కుర్చీ కాపాడుకోవాలని సిద్ధరామయ్య.. ఆ పీఠ దక్కించుకోవాలని డీకే శివకుమార్ పోటీ పడుతున్నారా? హైకమాండ్ పిలుపు కోసం నేతలు వెయిట్ చేస్తున్నారా? శనివారం సాయంత్రానికి డీకే శివకుమార్ హస్తినకు వెళ్లనున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
కర్ణాటక పాలక పక్షంలో నెలకొన్న రాజకీయ వివాదాన్ని పరిష్కరించడానికి కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధమైంది. పార్టీ హైకమాండ్ పిలుపు కోసం సీఎం సిద్ధరామయ్య- డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ వద్ద పట్టు నిలుపు కునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఈ క్రమంలో డీకే శివకుమార్‌కు క్రమంగా ఎమ్మెల్యేల మద్దతు పెరుగుతోంది.
ఆయనకు మద్దతుగా 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. డీకేను ముఖ్యమంత్రిని చేయకంటే భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని అంటున్నారు ఆయన మద్దతుదారులు. ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డీకే వర్గం డిమాండ్ చేస్తోంది. సీఎం పీఠం కోసం పట్టుబడుతోంది డీకే వర్గం. శుక్రవారం సాయంత్రానికి ఢిల్లీకి చేరుకోనున్నారు డీకే సోదరుడు సురేశ్.
ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమైన సిద్ధరామయ్య-డీకే శివకుమార్
శనివారం ఢిల్లీకి వెళ్లనున్నారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. అధికారం మార్పిడిపై రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ. విదేశీ పర్యటన ముగించుకుని శనివారం ఢిల్లీకి చేరుకోనున్నారు. ఆమె వచ్చిన తర్వాత సీఎం పీఠం ఎవరిదన్నది తేలిపోనుంది. సోనియాగాంధీతో భేటీ తర్వాత అధికారిక ప్రకటన రానుంది.
ఈ వ్యవహారంపై సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. రాహుల్ గాంధీ, ఇతర సీనియర్లతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని అన్నారు. హైకమాండ్ పిలిస్తే ఢిల్లీ వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అంటున్నారు సిద్ధరామయ్య. అటు డీకే శివకుమార్ కూడా అదే మాట చెబుతున్నారు.
మరోవైపు మంత్రి ప్రియాంక్ ఖర్గే, కర్ణాటకలో పరిస్థితిని హైకమాండ్ నిశితంగా పరిశీలిస్తోందన్నారు. బుధవారం రాత్రి తన నివాసంలో పలువురు మంత్రులు, సీనియర్ నేతలు, కీలక నేతలతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమావేశమైనట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి పార్లమెంటు సమావేశాలకు ముందే కర్ణాటక పాలకపక్షంలో నెలకొన్న అనిశ్చితి తొలగిపోనుందని అంటున్నారు.